డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
తిరుపతి తుడా : స్థానిక ఓల్డ్ మెటర్నరీ ఆసుపత్రి ప్రాంగణంలోని ఎపిడమిక్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్‌లోని మందుల డేటాను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పీహెచ్‌సీ కేంద్రాలకు మందులను తరలించేందుకు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.
హత్యాయత్నం కేసులో 10 ఏళ్ల జైలు
చిల్లకూరు : మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ ఆస్తి విషయంలో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో నెల్లూరు కోర్టు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షను శుక్రవారం ఖరారు చేసింది. చిల్లకూరు పోలీసుల వివరాల మేరకు తిక్కవరం గ్రామానికి చెందిన రాయపాటి వీర రాఘవయ్య కుటుంబ ఆస్తి విషయంలో వరసకు తనకు చెల్లి అయిన వెంకటలక్ష్మిపై 2017లో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్‌ఐగా ఉన్న శ్రీనివాసరావు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసు వాదోప వాదాలు ముగించుకుని నిందితుడి నేరం రుజువు కావడంతో తీర్పు దశకు చేరుకుంది. ఈ క్రమంలో నెల్లూరులోని 8వ అదనపు జిల్లా జడ్జి తీర్పును వెల్లడిస్తూ నిందితుడు వీర రాఘవయ్యకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో రెండు నెలలు సాధారణ జైలు శిక్షను అనుభవించాలన్నారు.


