ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు
తిరుమల : శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్‌ఈఓలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఏడాది ఫిబ్రవరి నుంచి అంగ ప్రదక్షిణం ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్‌లో పలువురు భక్తులతో ఆయన మాట్లాడారు. వివరాలు ఈఓ మాటల్లోనే..
● తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.
● భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత షెల్టర్, క్యూలైన్లు, స్టీల్ ఫుట్ ఓవర్ వంతెనలు, మరుగుదొడ్లు నిర్మిస్తాం.
● శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
● రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తాం.
● టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడతాం.
● అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులకు ఈనెల 27వ తేదీన శ్రీకారం చుడతాం.
● శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచిస్తున్నాం.


