కొల్లగొట్టు.. అడిగేదెవరు! | - | Sakshi
Sakshi News home page

కొల్లగొట్టు.. అడిగేదెవరు!

Oct 18 2025 7:01 AM | Updated on Oct 18 2025 7:01 AM

కొల్లగొట్టు.. అడిగేదెవరు!

కొల్లగొట్టు.. అడిగేదెవరు!

ఖనిజ సంపదను లూటీ చేస్తున్న కూటమి నేతలు అనుమతి లేకుండా తెల్లరాయి తరలింపు రాయల్టీ చెల్లింపులు ప్రైవేటుకు అప్పగించినా ఆగని అక్రమాలు గనుల లీజు గడువు ముగిసినా ఆగని దందా కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు హుళక్కే ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పట్టించుకోని అధికారులు

గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. గనుల లీజుల కాల పరిమితి దాటిపోయినా తవ్వకాలు ఆగడంలేదు. లీజు కాలం ముగిసిందని అడిగే అధికారి లేరు. ప్రభుత్వ సంపదను అక్రమంగా దోచేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులకు చెవికెక్కడంలేదు. స్థానికంగా ఉన్న ఓ కూటమి నేత అండ దండలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఖనిజ సందను కొల్లగొడుతున్నారు. అధికారుల నుంచి నేతల వరకు ముడుపులు ముట్టుజెబుతుండడంతో తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉన్నతాధికారులైనా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.!

సాక్షి టాస్క్‌ఫోర్సు : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఖనిజ సంపదపై కన్నెసి అక్రమ మార్గంలో తవ్వి పచ్చనేతలు జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా ఖనిజ సంపదను తరలించడంలో స్థానిక నేత అండ దండలు ఉండడంతో గూడూరులో దొరికే ఖనిజ సంపద అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

2024లో కాలం ముగిసినా..

50 ఏళ్లకు గూడూరు మండలం కందలిలోని మైన్స్‌కు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం 2024 నవంబర్‌ నాటికి కాల పరిమితి పూర్తి అయ్యింది. అయితే మైనింగ్‌ యజమానులు రెండవ సారి దరఖాస్తు చేసుకున్న 20 ఏళ్ల కాల పరిమితిని బూచిగా చూపుతూ స్థానిక కూటమి నేతల అండ దండలతో గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయితో పాటుగా ఇతర ఖనిజాలను తరలించేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే గనుల్లో గతంలో తవ్విన గుంతల్లో మట్టి నింపేందుకు పనులు చేస్తున్నామని చెబుతున్నారు. రాత్రి పూట తవ్వకాలను చేపట్టి మెటీరియల్‌ను మరోచోట డంప్‌ చేసి తరలించేస్తున్నారు.

చెక్‌ పోస్టులు పెట్టినా ..

మైనింగ్‌కు సంబంధించిన ప్రతి ఖనిజానికి లీజుదారులు ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయిల్టీ ప్రభుత్వానికి అందడం లేదని ఇటీవల ఓ ప్రవేటు ఏజెన్సీకి రాయిల్టీ వసూళ్లకు అనుమతి ఇచ్చింది. వారు పలు ప్రాంతాలలో చెక్‌ పోస్టులు పెట్టారు. అయితే కందలిలోని మైనింగ్‌ యజమానులు గతంలో తవ్వి నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించుకునేందుకు అనుమతులు లేకపోయినా ఉన్నట్లు చెబుతూ అక్రమంగా తెల్లరాయిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారులు ఉన్నట్లా..లేనట్లా..!

గూడూరు మండలం కందలి గ్రామ సమీపంలో కాలం చెల్లిన మైన్‌లో ప్రతి రోజు అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారని రెవెన్యూ, గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో కూటమి నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులు పట్టించుకోకపోవడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనలకు తూట్లు

మైనింగ్‌ లీజు పొందిన వారు కాల పరిమితి తీరి పోయిన తరువాత తవ్వకాలు చేపట్టిన భూమికే కాకుండా అదనంగా ఉండే ప్రాంతానికి కూడా డెడ్‌ రెంట్‌ చెల్లించాల్సి ఉంది. అయితే అలాంటివి ఏమి చెల్లించకుండా ఖాళీగా ఉండే భూమిలో తవ్వకాలు చేసి గతంలో తవ్విన గుంతలను నింపి వేస్తున్నారు. ఇలాంటి వాటిపై గనుల శాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చినా స్థానిక నేత అండ దండలు మెండుగా ఉండడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

స్థానిక నేతల అండదండలు

గూడూరు నియోజకవర్గంలో దొరికే తెల్లరాయి, సిలికా, ఇసుక, లాంటి ఖనిజాలు అక్రమ తవ్వకాలు ఆగకుండానే కొనసాగుతున్నాయి. తెల్లరాయిని రాత్రి సమయంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెల్లరాయి తవ్వకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసినట్లు కనికట్టు చేసినా లోపల జరిగే తంతు మాత్రం అడ్డుకోలేకపోతోంది. గూడూరు మండలం కందలి గ్రామంలో ఉన్న ఓ మైన్‌కు లీజుల కాల పరిమితి అయిపోయినా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని దర్జాగా తరలించేసి సొమ్ము చేసుకుని జేబులు నింపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement