
‘శ్రీనివాసా’ ఇదేంది స్వామీ?
● ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిపై ఆరోపణలు ● వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు దుర్వినియోగం చేశారని లేఖలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శివకామేశ్వరి శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివానందస్వామి టీటీడీ ఈఓ, టీటీడీ సీవీ అండ్ ఎస్‌ఓకు లేఖ రాశారు. టీటీడీ కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయంపై విచారణ చేయాలని ఆలేఖ ద్వారా కోరారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. టీటీడీ నుంచి పొందిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఆయన వనం శ్రీనివాస్ అనే దళారీ ద్వారా భక్తులకు ఒక్కో లెటర్‌ను రూ.20వేల చొప్పున విక్రయించినట్లు తనకు సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండడంతో పాటు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయన్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామికి టీటీడీ ద్వారా ఎన్ని వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు జారీచేశారో, ఆ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారో, వాటి వినియోగం ఎలా జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. భక్తుల వద్దకు టికెట్లు విక్రయించినట్లు నిరూపణ అయితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్వామీజీ ముసుగులో దళారీతో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని శ్రీశ్రీశ్రీ శివానందం స్వామి వివరించడం గమనార్హం. ఈమేరకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.