
యువతే దేశ సంపద
తిరుపతి సిటీ: యువతే మన దేశానికి నిజమైన సంపదని ఎస్వీయూ వీసీ తాతా నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియం వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న యువతరంగ్ – 2025 కార్యక్రమంలో గురువారం వీసీ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితానికి కళలు, సాహిత్యం వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి సంప్రదాయాలకు కళలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కళలు, సంగీతంపై ఆసక్తి ఉన్నా, సాధన చేయడం సాధ్యం కాలేదని తెలిపారు. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో యూనివర్సిటీ మంచి గుర్తింపును సంతరించుకోవడం శుభపరిణామన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సాంస్కృతిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని తెలిపారు.
ర్యాలీలో అలరించిన వేషధారణ
యువతరంగ్–2025లో భాగంగా వర్సిటీలోని అన్నమయ్య భవన్ నుంచి శ్రీనివాస ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు. కోలాటాలతో భక్తిరస గీతాలతో ఆలపిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీవారి, అమ్మవారి వేషధారణలో వీక్షకులను అలరించాయి.
ర్యాలీలో కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు
హల్‌చల్ చేసిన సినీనటుడు కిరణ్ అబ్బవరం
ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతరంగ్– 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, హల్‌చల్ చేశారు. విద్యార్థుల కేరింతల నడుమ ఆయన మాట్లడుతూ తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంతో ఉత్తేజం పొందానని తెలిపారు. తనకు వచ్చిన గుర్తింపునకు యువ త ముఖ్యకారణం అన్నారు. భవిష్యత్తులోనూ తనను ఇలాగే ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. తొలినాళ్లలో తనకు లక్ష్యం ఏమిటో అర్థం కాలేదని తెలిపారు. పాతికేళ్ల వయసులో జీవిత లక్ష్యం అర్థమైందని, కళాకారుడిగా రాణిస్తానని నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డెవలప్‌మెంట్ కౌన్సిల్, డీన్ ఆచార్య చెండ్రాయుడు, ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సుధారాణి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆచార్య బీవీ మురళీధర్, కల్చరల్ అఫైర్స్ కో– ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ ఉదయ్, రాజశేఖర్, ప్రసన్న, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

యువతే దేశ సంపద