
పత్తి గుట్టలో మట్టి దోపిడీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చంద్రగిరి సమీపంలోని పత్తి గుట్ట పచ్చనేతలకు ఆదాయ వనరుగా మారింది. ఏడాదిగా యథేచ్ఛగా మట్టిని తవ్వుకుంటూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ రెవెన్యూ అధికారులు దాడులు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం లెక్కచేయడం లేదు. వారం రోజులుగా రాత్రివేళల్లో అక్రమంగా పత్తిగుట్ట నుంచి వందలాది ట్రిప్పుల గ్రావెల్‌లో దోచేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరి బీసీ హాస్టల్ సమీపంలోని సర్వే నంబరు 1479లో సుమారు 5 ఎకరాలకుపైగా పత్తిగుట్ట ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పచ్చనేతలు ఈ గుట్టను చెరబట్టారు. జేసీబీల సాయంతో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల మట్టిని తరలించేస్తున్నారు. నెల క్రితం వరకు పగటి పూట అక్రమ దందా సాగిస్తున్న క్రమంలో రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో కాస్త తగ్గారు. అయితే వారం రోజులుగా గ్రావెల్ మాఫియా పడగవిప్పినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు సుమారు 10 ట్రాక్టర్లు, రెండు టిప్పర్లతో మట్టి తోలేస్తున్నారు. మంగళవారం రాత్రి ఒకేసారి 10 ట్రాక్టర్లు వరుస క్రమంలో మట్టిని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టవర్‌క్లాక్ సర్కిల్ నుంచే 10 ట్రాక్టర్లు ఏకకాలంలో వెళుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గస్తీ చేస్తున్న పోలీసులు సహకారం అందించడంతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు.

పత్తి గుట్టలో మట్టి దోపిడీ