
17 నుంచి పవిత్రోత్సవాలు
– అంకురార్పణ రేపు
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 17వ తేది నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం తిరుప్పావడ సేవ, అక్టోబర్ 17 నుంచి 19 వరకు నిత్య కళ్యాణోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఖాతాదారులకు
అత్యుత్తమ సేవలు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతన శాఖను సోమవారం ఆ బ్యాంకు సీజీఎం రాజేష్‌కుమార్ పటేల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ఎస్‌బీఐ స్థానిక ప్రజలకు మెరుగైన, విస్తృత సేవలందించేందుకు నూతన శాఖను ఏర్పాటు చేశామన్నారు. తమ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందించడం, ప్రాంతీయ ఆర్థిక సమ్మిళత లక్ష్యాలను అధిగమించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జీఎం అమరేంద్రకుమార్ సుమన్, డీజీఎం దినేష్ గులాటి, ఆర్‌ఎం ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ లాక్కున్నారని ఆత్మహత్యాయత్నం
పాకాల : సెల్‌ఫోన్ లాక్కున్నారని మనస్తాపంతో ఓ బాలుడు (15) ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం రాత్రి పాకాల భారతంమిట్టలో జరిగింది. ఇన్‌స్ట్రాలో చాటింగ్ చేస్తుండగా కుటుంబసభ్యులు సెల్‌ఫోన్ లాక్కోవడంతో బాలుడు వెంటనే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి బాలుడిని బయటకు తీసుకువచ్చారు. చేయి కోసుకుని అపస్మారకస్థితి చేరుకుని ఉండడంతో 108లో కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
అమ్మవారి ఆలయంలో.. అధికారి బరితెగింపు
చంద్రగిరి : భక్తుల సేవే..భగవంతుని సేవ అనే సూత్రానికి టీటీడీ అధికారులు నీళ్లొదిలేశారు. భక్తులు ఎదురు మాట్లాడితే దాడులు చేస్తాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమలంఓనే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ అధికారి తీరు దారుణంగా తయారైంది. భక్తులపైనే దాడులకు పాల్పడుతున్నారు. వివరాలు.. అమ్మవారి దర్శనానికి చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా తన కుటుంబంతో మంగళవారం వచ్చింది. గర్భాలయంలో పద్మావతీదేవిని ఆండాళ్ దర్శించుకునే సమయంలో అలివేలు అనే జమేదారు దురుసుగా ప్రవర్తించింది. ఆవేశంతో హిజ్రాపై చేయి చేసుకుంది. దీంతో ఇరువురూ దూషణ పర్వానికి దిగడంతో భక్తులు దిగ్భాంత్రి చెందారు. గతంలో అనేక సార్లు అలివేలు ఇదే తరహాలో భక్తులపై దాడి చేసిన ఘటనలు ఉన్నట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు.