
నెత్తకుప్పంలో రోడ్డుకడ్డంగా గోడ
రామచంద్రాపురం: మండలంలోని నెత్తకుప్పం గ్రామంలో ఓ కూటమి నాయకుడు అధికార అహంకారంతో ఊరిని అక్రమ నిర్బంధంలోకి నెట్టేశాడు. రాజకీయ కక్షలతో గ్రామంలోకి ఓ కుటుంబం రాకపోకలను పూర్తిగా నిలిపివేశాడు. గ్రామ ప్రధాన రోడ్డుకే గోడ కట్టి మూసేశాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం.. స్థానికంగా జరిగిన చిన్న పంచాయితీ వివాదానికి దారితీసింది. దీంతో స్థానిక కూటమి నాయకుడు రెచ్చిపోయాడు. ఓ విలేకరి (సాక్షి కాదు) ఇంటి వద్ద ఏకంగా గోడను నిర్మించాడు. ఆ కుటుంబాన్ని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకట్టవేశాడు. రోడ్డుకు అడ్డుగా గోడ కట్టేశాడు. గ్రామస్తులను కూడా నిర్బంధించాడు. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణకు చర్యలు చేపట్టారు. వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు.