
రోగి సహాయకురాలిపై ఆస్పత్రి సిబ్బంది దాడి
తిరుపతి తుడా : రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సహాయకురాలిపై రుయా సిబ్బంది దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం రుయాలో చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన సాయిరాం చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను రుయాకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రుయాకు చేరుకున్నారు. ఉన్న ఎంఎన్‌ఓ సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితుడి అక్కపై వెనుక నుంచి చేయి చేసుకోవడంతో మహిళలు ఆగ్రహించారు. అత్యవసర విభాగం నుంచి బంధువులను బయటకు గెంటేశారు. దీంతో గాయపడ్డ సాయిరాం బంధువులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల సిబ్బంది ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. రుయాలో వైద్య సేవలు క్షీణించాయని, ప్రవర్తన కూడా మర్యాదపూర్వకంగా లేదని బాధితురాలు పద్మజ మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ ఎంఎన్‌ఓ పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.