
‘కోటి సంతకాల’తో నిలదీస్తాం
తిరుపతి మంగళం : పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఉన్నత ఆశయానికి గండి కొడుతున్న కూటమి సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని మేయర్ శిరీష స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. చంద్రబాబుకు అమరావతిలో రాజధాని నిర్మాణంపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీలపై లేదన్నారు. అమరావతిలోని టీడీపీ నేతల భూములకు ధరలు పెంచుకునేందుకే రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో తెచ్చిన రూ. లక్షల కోట్లు అప్పులు ఏంచేశారని ప్రశ్నించారు. జగనన్నకు మంచి పేరు వస్తుందనే కక్షతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కుట్రపూరితంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్ ఆరణి సంధ్య, నేతలు ఉదయ్‌వంశీ, కట్టా గోపీయాదవ్, వాసుయాదవ్, గీతాయాదవ్, మల్లం రవికుమార్, దినేష్‌రాయల్, మద్దాలి శేఖర్, మురళి, గోపాల్‌రెడ్డి, లవ్లీ వెంకటేష్, వెంకటేష్‌రాయల్, రమణారెడ్డి, ధనశేఖర్, పద్మజ, శారద, విజయలక్ష్మి, శాంతారెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
చిల్లకూరు : మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అప్పగించే నిర్ణయాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు
తూ.. పేద విద్యార్థులు మెడిసన్ విద్యను పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుతారనే అక్కసుతో కూటమిలోని పెద్దలు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్య బట్టారు. పట్టణంలోని ప్రతి వార్డులో సంతకాల సేకరణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

‘కోటి సంతకాల’తో నిలదీస్తాం