
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని కాండ్ర–వెందోడు మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలాయపల్లి మండలం గొట్టికాడు గ్రామానికి చెందిన జశ్వంత్(23) దుర్మరణం చెందాడు. గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు గొట్టికాడు గ్రామానికి చెందిన ప్రభాకర్, జ్యోత్స్న కుమారుడు జశ్వంత్ గూడూరు పట్టణంలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే కుటుంబానికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి బైక్‌పై గూడూరుకు బయలుదేరగా కాండ్ర గామానికి చెందిన శీనయ్య మోటార్ సైకిల్‌పై వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న జశ్వంత్ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శీనయ్యకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. మనోజ్‌కుమార్ తెలిపారు.