
ఎర్రచందనం పట్టివేత
భాకరాపేట : తలకోన మార్గంలోని పూలకుంటపల్లె వద్ద కారులో తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్ వెంకటరమణ తెలిపారు. ఆదివా రం అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం పట్టుబడినట్టు వెల్లడించారు. పరారవుతున్న నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితులను తమిళనాడుకు చెందిన చందిరాజన్ ఇజ్మలై, తరుమన్ సామికన్నుగా గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 11 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వరదయ్యపాళెం : తడ–శ్రీకాళహస్తి రహదారిపై బత్తలవల్లం సమీపంలోని ఇనమాలగుంట అటవీప్రాంతం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సత్యవేడు మండలం జడేరి పంచాయతీ కేవీకండ్రిగ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తడలో నివాసమున్నాడు.ఈ క్రమంలో పరిశ్రమలో తనతో పనిచేస్తున్న మిత్రుడిని కలిసేందుకు వరదయ్యపాళెం వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులును సూళ్లూరుపేటలోని ఓ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ సాయిబాబా తెలిపారు.