
మగవారి ఫీట్లు
మహిళల పాట్లు..
తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి సెంట్రల్ బస్టాండ్ నుంచి ప్రతి రోజు 1.50 లక్షల నుంచి 1.60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా సర్వీసులను ఏర్పాటు చేయడం లేదని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీ్త్రశక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించిన తర్వాత పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొన్ని మార్గాల్లో ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి వేళ ఒకటి.. అంటే మూడే సర్వీసులను ఏర్పాటు చేశారు. సోమవారం తిరుపతి బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కాదు. బస్సు ఆగిన వెంటనే సీట్ల కోసం ప్రయాణికులు పీట్లు చేశారు. బస్సు కిటికీల్లో నుంచి దూరేస్తున్నారు. కొందరు కిటికీల్లో నుంచి లగేజీలు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత బస్సెక్కి సీట్ల కోసం ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. డ్రైవర్ డోర్ నుంచి కొందరు ప్రయాణికులు సీట్ల కోసం లోపలకు దూరుతున్నారు. అయితే బస్సుల కొరత తీవ్రంగా ఉందని తాము చేసేదేమీ లేదని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేస్తున్నారు.