
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,412మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,058 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
పశు వైద్య కళాశాలలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు
చంద్రగిరి: తిరుపతిలోని ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఈనెల 8, 9వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. ఎస్వీ పశు వైద్యకళాశాలలోని పశువైద్య చికిత్స, బోధన విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 250 మంది పశువైద్య విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పశువుల్లో వచ్చే వ్యాధుల నిర్ధారణ, చికిత్స, నివారణ, శస్త్ర చికిత్సలు, గర్భకోశ వ్యాధులపై శాసీ్త్రయపరమైన చర్చలు నిర్వహిస్తారన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తమిళనాడు పశువైద్య విశ్వవిద్యాలయం రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ ఎస్.తిలగర్ హాజరవుతారని చెప్పారు.