
4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
కేవీబీపురం : మండలంలోని సూరమాల వద్ద మామిడితోటలో అక్రమంగా నిల్వ చేసిన 4.4 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు.. రేషన్ దందాపై పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టబడిన బియ్యం విలువ సుమారు రూ.50వేల వరకు ఉండవచ్చని తెలిపారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం బస్తాను గోడౌన్‌కు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
చోరీ కేసులో
నిందితుడికి రిమాండ్
రేణిగుంట : మండలంలోని కొత్తపాళెంలో ఇత్తడి బిందెలను చోరీ చేసిన కేసులో నిందితుడు జయచంద్రారెడ్డి(30)కి కోర్టు రిమాండ్ విధించింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. జయచంద్రారెడ్డిపై గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు రెండు ఉన్నట్లు వెల్లడించారు.
యువకుడిపై పోక్సో కేసు
చంద్రగిరి : బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు.. చంద్రగిరి బీడీ కాలనీకు చెందిన బాలిక(14) శనివారం ఇంటి వద్ద పాత్రలు కడుగుతుండగా, పాకాల అలీ అనే యువకుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వెంటనే అలీ అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
విద్యుదాఘాతంతో
లైన్‌మన్ మృతి
సత్యవేడు: మండలంలోని బాలకృష్ణాపురం పంచాయతీలో ఏ.సుబ్రమణ్యం (49) అనే లైన్‌మన్ విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేస్తుండగా సుబ్రమణ్యానికి కరెంట్ షాక్ తగలండంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య రేవతి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. భర్త మృతిపై అనుమానం ఉందని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు.
తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్: తమిళనాడులోని తిరువణ్ణామలైకి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 4 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే తిరిగి రావడానికి అవసరమైన బస్సులను సమకూర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత