
దేవుడికే శఠగోపం!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి మండలం, మామండూరు పరిధిలోని దేవుడు మాన్యాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఈ భూమికి విపరీతమైన ధర పలుకుతోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.10 కోట్ల పైమాటే. సీఎం చంద్రబాబు సమీప బంధువు కావడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు. గ్రామస్తులు వివరాల మేరకు.. మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి అనుకుని మామండూరు గ్రామ సమీపంలో సర్వే నం.91/1లో సుమారు 0.83 సెంట్ల గుడిమాన్యం పోరంబోకు ఉంది. రహదారి విస్తరణ చెందడంతో ప్రస్తుతం ఆ భూమి ధర రూ.10 కోట్లకు పైమాటేనని స్థానికులు చెబుతున్నారు.
కబ్జాకు స్కెచ్ వేసిన సీఎం సమీప బంధువు
ఆ దేవుడు మాన్యం భూమిపై అదే గ్రామానికి చెందిన సీఎ చంద్రబాబు సమీప బంధువు కన్నుపడింది. ఎలాగైనా కబ్జా చేయాలని పథకం పన్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ భూమిలో చిన్నపాటి రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. ఆపై దుకాణం వెనుక వైపు ఉన్న భూమిని చదును చేయడం ప్రారంభించాడు. తరతరాలుగా దేవు డు మాన్యాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడు కుంటూ వస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేవుడు మాన్యాన్ని హస్తగతం చేసుకోవడానికి యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చర్యలెక్కడ
దేవుడు మాన్యాన్ని కాపాడాలని గ్రామస్తులు దేవదాఖ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఆ భూమిలో అనధికారికంగా దుకాణాన్ని ఏర్పాటు చేసి, ఆపై ప్లాట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు యత్నిస్తున్నట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దేవదాయ శాఖ అధికారులు కబ్జారాయుళ్లపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపిస్తునానరు. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సి ఉంది.