
7 నుంచి జాతీయ సహకార సదస్సు
తిరుపతి అర్బన్: తిరుపతి వేదికగా మూడు రోజుల పాటు జాతీయ సహకార సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆయన శనివారం సదస్సు నిర్వహణపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి లక్ష్మితో పాటు జూమ్ మీటింగ్‌లోనూ పలువురు అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9 వరకు తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్ షాపు ఉంటుందని వెల్లడించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ కార్యక్రమాల అమలుపై సమీక్షించడానికి త్రైమాసిక సమావేశం జరగనుందని తెలిపారు. సమావేశానికి జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటాని, ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సెరికల్చర్ కో–ఆపరేషన్స్, మార్కెటింగ్ తదితరులు రానున్నారని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ కో– ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్‌డీఓలు తిరుపతి, శ్రీకాళహస్తి రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, ఆర్టీసీ, టూరిజం అధికారులు హాజరయ్యారు.