
దౌర్జన్యంగా ప్రహరీ కూల్చివేత
ఏర్పేడు : మండలంలోని మాధవమాలలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడి ఇంటి ప్రహరీని శనివారం జేసీబీ సాయంతో కూల్చి వేశారు. అడ్డు వచ్చిన బాధితులపై దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు... మాధవమాలకు చెందిన పెరుమాల్ ఆచారి ఇంటి వద్ద వీధి సందుకు ఆనుకుని పట్టా భూమిలో ప్రహరీ నిర్మించారు. అయితే ఈ గోడను తొలగించాలని చూడగా గ్రామానికి చెందిన కొందరు అడ్డు చెప్పడంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన టీడీపీ నేత భాస్కర్ ఆచారి, కిషోర్, ధనంజయులఆచారి, ధనరాజ్ ఆచారి, రవి ఆచారి, రాజ్‌కుమార్ తమ ఇంటి వద్దకు జేసీబీ తీసుకొచ్చి గోడను కూల్చేశారని బాధితుడు వాపోయాడు. గోడ కూల్చుతుండగా అడ్డుకున్న పెరుమాల్ ఆచారి, అతడి భార్య పద్మ, కుమారుడు మోహన్‌పై దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పింఛన్ సొమ్ము స్వాహా
గూడూరు రూరల్ : గూడూరు మండలం కొమ్మనేటూరు పంచాయతీ సచివాలయ పరిధిలోని 64 మంది పింఛన్‌దారులకు సంబంధించిన రూ.2.85 లక్షల నగదును వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్ స్వాహా చేసినట్లు సమాచారం. 160 పెన్షన్లకు సంబంధించిన నగదును తీసుకెళ్లి ఈనెల 1, 3 తేదీలలో మధ్యాహ్నం వరకు 96 పింఛన్లకు సంబంధించి నగదును అందించారు. మిగిలిన 64 పింఛన్‌లకు సంబంధించి రూ.2.85 లక్షల నగదును పంపిణీ చేయకుండా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ చెంచు ప్రసాద్ ఉన్నతాధికారులతో పాటు ఇన్‌చార్జి ఎంపీడీఓ కౌసల్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం వెల్ఫేర్ అసిస్టెంట్ రాకేష్‌ను కార్యాలయానికి పిలిపించి మెమోను జారీ చేసినట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీఓ తెలిపారు. సోమవారం లోగా పింఛన్ల నగదును అందించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.