
వైభవం.. వెంకన్న రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి కల్కి అవతారంలో భక్తులను కటాక్షించారు. అంతకు ముందు స్వామి, అమ్మవార్ల ఊంజల సేవ జరిపించారు.
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంటలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం రథోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అలంకార మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చారు. భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మరథంపై ఊరేగుతున్న బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు చల్లి కర్పూర హారతులు సమర్పించారు. చెవిరెడ్డి లక్ష్మి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. రథోత్సవం ముగిసిన తర్వాత ఆలయంలోని కల్యాణ మండపంలో దేవదేవేరులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అలరించిన కోలాటం, భజనలు
రథోత్సవంతో పాటు అశ్వవాహన సేవల్లో కళాకారులు, భజన బృందాలు అలరించాయి. వృషభాలు ముందు నడుస్తుండగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

వైభవం.. వెంకన్న రథోత్సవం

వైభవం.. వెంకన్న రథోత్సవం