
తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రవిమనోహరాచారి
తిరుపతి రూరల్ : తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన ఏడుగురు దొంగలను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.24లక్షల విలువైన 240గ్రాముల బంగారం, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చంద్రగిరి డీఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాలు వెల్లడించారు. తుడా క్వార్టర్స్ ఎంఐజీ ప్లాట్ నంబరు 87లో సెప్లెంబర్ 10వ తేదీన చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేట ప్రారంభించారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐలు ఎం.అరుణ, జగన్నాథరెడ్డి, సాయినాథ్ చౌదరి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి వద్ద దొరికిన వేలిముద్రల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైమ్ బ్రాంచి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తలుపులు మూసి తాళం వేసియున్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా ఆచూకీని కనిపెట్టారు. ఆ ముఠాలో 7మంది సభ్యులను తిరుచానూరు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తోట శివకుమార్, అతడి భార్య తోట వరలక్ష్మి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాదవరంపోడుకు చెందిన సూరేపల్లి వెంకటేష్, కడపటౌన్ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన గొడుగు అజీజ్, రైల్వేకోడూరు మండలం, మాధవరం పోడుకు చెందిన చిన్నమేకల దేవి, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మర్లోతు గాయత్రి, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కంట్లం గ్రామానికి చెందిన కొవ్వాసి రాధాకృష్ణ ఉన్నారు. వీరిలో తోట శివకుమార్ మీద 150కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలతో పాటు క్రైమ్ పార్టీ సిబ్బంది టి.ప్రభాకర్, వీఎల్‌ఎన్ ప్రసాద్, ఎం.ప్రసాద్, ఆర్.షఫీని ఎస్పీ సుబ్బ రాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అభినందించారు. నగదు రివార్డులను ప్రకటించారు.