
శ్మశాన వాటిక పరిరక్షణే లక్ష్యం
తిరుపతి తుడా: దశాబ్దాల నాటి శ్మశాన వాటికను కబ్జాకోరుల నుంచి కాపాడుకుంటామని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రకటించారు. శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై నిరసిస్తూ బుధవారం మారుతినగర్ శ్మశానవాటిక వద్ద వైఎస్సార్ సీపీ తిరుపతి యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుయాదవ్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్ తదితరులు మాట్లాడారు. దొడ్డిదారిని డిప్యూటీ మేయర్ అయిన ఆర్‌సీ మునికృష్ణ అధికారం అడ్డు పెట్టుకుని శ్మశానవాటిక కబ్జాకు యత్నించడం శోచనీయమన్నారు. శ్రీనివాసులు నాయుడు అతని భార్య పేరుతో రెండు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్ పల్లె, మారుతి నగర్ పరిసర ప్రాంత ప్రజలను ఏకం చేసి శ్మశాన స్థలం పరిరక్షణకు కార్పొరేషన్ కార్యాలయాన్ని, డిప్యూటీ మేయర్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ వంశీ, నాయకులు మల్లం రవి, కిషోర్ రెడ్డి, కోటి, పద్మ, అఖిల్, దామా షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు.