
కూటమి ‘కోతలు’!
తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అందించే పథకాల్లో యథేచ్ఛగా కోత పెడుతోంది. ముందుగా సామాజిక పింఛన్లను ప్రతి నెలా తగ్గించేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 12,566 పింఛన్లు తొలగించింది. ఈ నెలలో 355 మందికి లబ్ధిదారులకు రిక్తహస్తం చూపింది. 8 వేల మంది వితంతువులకు కొత్తగా పింఛన్ మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటోంది. అర్హులైన 10వేల మందికిపైగా దివ్యాంగులను ఆశనిరాశల నడుమ వేధిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై శీతకన్ను వేసి ఉసురుపోసుకుంటోంది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని దాదాపు 17 నెలలుగా రోడ్ల పాలు చేసేసింది.
కందిపప్పు ఊసేలేదు...
రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు పూర్తిగా ఇవ్వడంలేదు. చక్కెరను కూడా అంతంతమాత్రంగానే అందిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో సక్రమంగా రేషన్ అందక పేదలు నానా అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు చక్కెర, గోధమపిండి, రాగిపిండి, రాగులు ,కందిపప్పు తదితర వస్తువులను పంపిణి చేశారు. చిరుధాన్యాలు సైతం కార్డుదారులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.