తిరుపతి రూరల్ : తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు మంగళవారం ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు అనంత తేజోమయుడుగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చంద్రునిపై చల్లనయ్య దీవెనలు
సమస్త భూ మండలానికి ప్రత్యక్ష దేవతలుగా కనిపించే సూర్య, చంద్రులను వాహనాలుగా చేసుకున్న దేవదేవుడు భక్తులకు అభయహస్తంతో ఆశీస్సులు అందించారు. ఉదయం సూర్యునిపై అత్యంత తేజస్సుతో దర్శనమిచ్చిన స్వామి వారు రాత్రికి చంద్రునిపై కొలువుదీరి చల్లనయ్యగా భక్తులు అందరికీ చల్లని దీవెనలను అందించారు.
చంద్రునిపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
చిరుజల్లుల నడుమ సూర్యప్రభ వాహన సేవ
సూర్య ప్రభ వాహన సేవ ఆరంభం నుంచే చిరుజల్లులు కురవడంతో ఆ చల్లని వాతావరణంలోనే స్వామి వారి వాహన సేవ ముందుకు సాగింది. ఆలయం నుంచి సూర్యునిపై కొలువుదీరిన స్వామి వారి వాహనం బయలు దేరినప్పటి నుంచే వర్షం కురవడంతో ఛత్రం నీడలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు వాహన సేవలో పాలు పంచుకున్నారు. వాహన సేవల్లో కళాబృందాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాలు అన్నీ విద్యుత్తు వెలుగులతో ఆకట్టుకుంటున్నాయి.
దేవదేవుడి అభయం
దేవదేవుడి అభయం