
స్టూడెంట్.. ‘నంబర్ 1’
ఏర్పేడు : ఓ హత్య కేసులో జీవితఖైదీగా జైలులో ఉంటూనే చదువుపై మక్కువతో ఉన్నత విద్యాభ్యాసం చేసి గోల్డ్ మెడల్ సాధించాడో యువకుడు.. మంగళవారం హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందుకుని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. వివరాలు. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన గునకల బోయశెట్టి, గునకల చెంగమ్మ దంపతుల కుమారుడు యుగంధర్(35) రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో జరిగిన ఓ హత్య కేసులో 2011, జూలై 18న జీవితఖైదు పడి కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 15ఏళ్లుగా జైలులో గడుపుతున్న యుగంధర్ చదువుపై ఉన్న మక్కువను గుర్తించి జైలు అధికారులు ప్రోత్సహించటంతో జైలులోనే ఉంటూ దూరవిద్య ద్వారా విద్యాభ్యాసం చేశాడు. బీఏలో 8.2 జీపీఏ పాయింట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిస్థానాన్ని సాధించాడు. దీంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అధికారులు ఇటీవల అతడికి గోల్డ్ మెడల్‌ను ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు. ఓల్డ్ ప్యాటర్న్‌లో రెండు బీఏ డిగ్రీలు, న్యూ ప్యాటర్న్‌లో రెండు డిగ్రీలు, 3ఎంఏ డిగ్రీలు పూర్తి చేసి అందరిని అబ్బురపరిచాడు. యుగంధర్ తండ్రి ఏడాది కిందట మృతి చెందగా, జంగాలపల్లిలో అతడి తల్లి చెంగమ్మ నివసిస్తోంది. తన బిడ్డ సత్ప్రవర్తన కింద తప్పును మన్నించి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టాలని యుగంధర్ తల్లి చెంగమ్మ, గ్రామ సర్పంచ్ నారాయణ కోరుతున్నారు. అచ్చం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తరహాలో జైలులో ఉంటూ చదువుకుని ప్రతిభను కనబరిచిన యుగంధర్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సర్పంచ్ కొనియాడారు.

స్టూడెంట్.. ‘నంబర్ 1’