
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంతబాయి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 7 అంగన్‌వాడీ కార్యకర్తలు, 66 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి అక్టోబర్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. వారి పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి 21 ఏళ్లు నిండి ఉండాలని, 35 ఏళ్ల లోపు ఉండాలని స్పష్టం చేశారు. స్థానికంగా ఉంటూ వివాహిత అయి ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పదో తరగతి పాస్ అయిన వారు లేకుంటే 8వ తరగతి వారు అర్హులుగా ఉంటారని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండిన వారు లేని ఎడల 18 ఏళ్ల నిండిన వారు అర్హులుగా ఉంటారని తెలిపారు.