
గరుడునిపై గోవిందుడు
తిరుపతి రూరల్ : కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవంగా సాగింది. తిరుమలకు వెళ్లి శ్రీవారి గరుడోత్సవాన్ని తిలకించలేని సుమారు 75 వేల మంది భక్తులు తుమ్మలగుంటకు చేరుకుని గరుడోత్సవాన్ని తిలకించారు. రాత్రి 7.30 గంటలకు బయలుదేరిన గరుడ వాహనం అర్ధరాత్రి 12.30 గంటల వరకు సాగింది. కల్యాణ వేంకటేశ్వరుడు గరుడునిపై మలయప్ప స్వామిగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గరుడ వాహనం ముందు కాగడాలు భక్తులను ఆకర్షించాయి. గరుడోత్సవం ప్రారంభానికి మూడు గంటల ముందు చిరుజల్లులతో స్వాగతం పలికాయి. వర్షం కురిసిన కొద్ది సేపటికే స్వామి వారికి సమర్పించే గరుడ మాల, మేల్‌చాట్ వస్త్రాలు ఆలయం వద్దకు చేరుకున్నాయి.
శ్రీవారికి సారె సమర్పణ
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు ఇస్కాన్ ఆలయం నుంచి ఇస్కాన్ మందిరం ఉపాధ్యక్షులు రూపేశ్వర చైతన్య ప్రభుదాస్, కార్యదర్శి బలబద్ర ప్రభుల ఆద్వర్యంలో పట్టువస్త్రాలను సమర్పించారు. ఇస్కాన్ ప్రతినిధులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సాదరంగా స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె సమర్పించారు.

గరుడునిపై గోవిందుడు