
భక్తులకు బస్సులేవీ గోవిందా?
ప్రయాణికుల సిగపట్లు
తిరుపతి అర్బన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం గరుడోత్సవానికి బస్సులు లేక భక్తులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ భక్తులు రోడ్లపైన, బస్టాండ్లల్లో నిరీక్షించాల్సి వచ్చింది. ఉత్సవాలకు 425 బస్సులు ఏర్పాటు చేశామని, మూడు వేలకు పైగా ట్రిప్పులు తిప్పనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. కానీ ఆ బస్సులు ఏమైనాయో కానీ భక్తులు మాత్రం అవస్థల్లో మునిగిపోయారు.
ఏడు కొండల బస్టాండ్
తిరుమలకు భక్తులు వెళ్లడానికి తిరుపతి సెంట్రల్ బస్టాండ్ పరిధిలోని ఏడుకొండల బస్టాండ్ కీలకం. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ద్వితీయ, తృతీయ స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ప్లాట్‌ఫాంలో బస్సులను పెట్టకుండా ముందు భాగంలో ఖాళీ స్థలంలో ఎక్కడి పడితే అక్కడ ఉంచేశారు. ఈ క్రమంలో భక్తులు ఓ వైపు బస్సు కోసం పరుగులు పెట్టడం.. ఆ బస్సు ఫుల్ కావడంతో.. మరో బస్సు కోసం పరుగులు పెట్టడం కనిపించింది. దివ్యాంగులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు నాలుగు వైపులా బస్సు కోసం పరుగులు పెట్టలేక తిప్పలు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఏడు కొండల బస్టాండ్ సమీపంలోనే చెత్త కుప్పలను తొలగించకుండా అలానే వదిలేశారు. దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడ్డారు. ఏడుకొండల బస్టాండ్, పల్లెవెలుగు బస్టాండ్‌లో మరుగుదొడ్లు లేవు. శ్రీహరి బస్టాండ్‌లోని ఒక మరుగుదొడ్డి ఇటీవల తొలగించారు. మిగిలిందే ఒక్కటే ఉండగా.. అది శుభ్రం చేయకపోవడంతో భక్తులు దుర్వాసన భరించక తప్పలేదు.
ఇతర ప్రాంతాలకూ బస్సులు లేవు
ఏడుకొండల బస్టాండ్‌లోనే కాకుండా అదే ప్రాంగణంలోని పల్లెవెలుగు, శ్రీహరి, శ్రీనివాసం బస్టాండ్ల వద్ద బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి– తిరుపతి మధ్యలో 20కిపైగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. వాటిని శ్రీకాళహస్తికి రద్దు చేసి తిరుపతి–తిరుమలకు తిప్పుతున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, పుత్తూరు, పీలేరు తదితర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కొరతతో పల్లె వెలుగు వద్ద ప్రయాణికులు పడిగాపులు పడ్డారు.
ఇదేం తీరు
సాధారణంగా తిరుమలకెళ్లే భక్తులను మెయిన్ బస్టాండ్‌కు తీసుకొచ్చి దింపాల్సి ఉంది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తిరుమల నుంచి వచ్చే భక్తులను కపిలతీర్థం వద్దే దింపేశారు. భక్తులు మళ్లీ అక్కడి నుంచి ఆటో పట్టుకుని మెయిన్ బస్టాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తికమకపడ్డారు.
నిరీక్షించలేక
శ్రీవారి గరుడ సేవ సాయంత్రం ఆరు గంటలకే ప్రారంభమైంది. ఆపై వర్షం రావడంతో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఎప్పటికప్పుడు గ్యాలరీల నుంచి బయటకొచ్చేశారు. ఆపై ఇళ్లకు వెళ్లేందుకు బస్టాండుకు చేరుకున్నారు. అక్కడ సరిపడా బస్సులు లేకపోవడంతో.. రాంభగీచా వద్దకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. వచ్చే ఒకటీ రెండు బస్సుల్లో ఎక్కేందుకు కుస్తీలు పడాల్సి వచ్చింది.
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన గరుడోత్సవానికి భక్తులు పోటెత్తారు. వారికి తగిన ప్రయాణ సేవలు అందించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమైంది. తిరుమలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారనే ప్రాథమిక అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా చివరకు చేతులెత్తేశారు. ఆదివారం ఉదయం నుంచే ప్రయాణికులు తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండు, రైల్వేస్టేషన్, అలిపిరి బస్టాండ్‌కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బస్సుల కోసం పడిగాపులు పడ్డారు. బస్సులో ఎక్కేందుకు తోపులాటలో ప్రయాణికులు సిగపట్లకు దిగారు. కొందరు ముష్టి యుద్ధానికి పాల్పడడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి చేరుకునేందుకు పడ్డకష్టాలు అన్నీ ఇన్నీ కావు.

భక్తులకు బస్సులేవీ గోవిందా?

భక్తులకు బస్సులేవీ గోవిందా?

భక్తులకు బస్సులేవీ గోవిందా?

భక్తులకు బస్సులేవీ గోవిందా?

భక్తులకు బస్సులేవీ గోవిందా?