
మోహినీ అవతారంలో దేవదేవుడు
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన ఆదివారం ఉదయం స్వామి వారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గరుడోత్సవానికి ముందుగా స్వామి వారు మోహినీ అవతారం ధరించి భక్తులను కటాక్షించారు. పల్లకీపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంకణభట్టార్ శ్రీనివాసాచార్యులు ఆలయం వద్దనున్న అలంకార మండపంలో స్వామి వారిని మోహినిగా ముస్తాబు చేసి పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీ ఉత్సవం వైభవంగా సాగింది.
అట్టహాసంగా ఊరేగింపు
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడోత్సవానికి ఉపయోగించే నూతన గొడుగులు, మేల్‌చాట్ వస్త్రాలను తుమ్మలగుంట గ్రామానికి చెందిన చెంచురెడ్డి ఇంటి నుంచి సంప్రదాయంగా తీసుకొచ్చారు. వాయిద్యాలు, వేద మంత్రాలు నడుమ నూతన గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. గరుడోత్సవానికి ఉపయోగించే ఆ గొడుగులకు గ్రామస్తులు కర్పూర హారతులు పట్టారు. నూతన గొడుగులను చెంచురెడ్డి కుటుంబీకుల నుంచి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్వీకరించారు.
భక్తులచే సారె సమర్పణ
పల్లకీపై ఊరేగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం, కేసీపుట, చిగురువాడ, వేదాంతపురం, పైడిపల్లి, పాతకాల్వ, రామానుజపల్లికి చెందిన భక్తులు తీసుకొచ్చిన సారెను ఆలయంలోని మూలమూర్తి ముందు పెట్టి పూజ చేశారు. సారె తీసుకొచ్చిన భక్తులు అందరికీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సాదర స్వాగతం పలికి దైవ దర్శనం చేయించారు.
పేరూరు నుంచి పట్టువస్త్రాల సమర్పణ
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా పేరూరు వాసులు అందించే పట్టువస్త్రాలను ఈ ఏటా సమర్పించారు. ఎంపీపీ మూలం చంద్రమోహన్‌రెడ్డి, పి.కేశవులురెడ్డి, జి.భాస్కర్‌రెడ్డి, సి.మునికుమార్‌రెడ్డి, వి.బాలక్రిష్ణ, దామోదరం అయ్యవార్లతో పాటు గ్రామస్తులతో కలసి స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. పట్టువస్త్రాలతో పాటు గజమాల, వివిధ రకాల పండ్లు సమర్పించారు.

మోహినీ అవతారంలో దేవదేవుడు