
ప్లాట్లు వేసి..బేరం పెట్టి !
రేణిగుంట : రేణిగుంట–పాపానాయుడు పేట మార్గంలో రూ.కోట్ల విలువ చేసే మేత పోరంబోకు భూమి అక్రమార్కులపరం అవుతోంది. కూటమి నేతలు ప్లాట్లు వేసి బేరం పెట్టి ప్లాటు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల చొప్పున విక్రయించి అక్రమంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న సుమారు 500 ఇళ్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేలమట్టం చేశారు. కానీ ఇదే కూటమి నాయకుల అండతో కోట్ల రూపాయలు విలువ చేసే 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ముఖ్యనేత పీఏతో ఒప్పందం
రేణిగుంట మండలంలోని జీపాల్యం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 213/2 లో 1.8 ఎకరాలు, 213/3 లో 4.3 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. రేణిగుంట– పాపా నాయుడుపేట ప్రధాన రహదారి పక్కన ఉండటంతో ఈ భూమికి మంచి డిమాండ్ ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు భూ ఆక్రమణదారులు గత ప్రభుత్వంలోనూ కబ్జాకు ప్రయత్నించారు. అయితే స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలు ఆక్రమణలను అడ్డుకున్నారు. కట్టడాలను నేలమట్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే అక్రమ దారులు ఆ భూములపై కన్నేశారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడి పీఏతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ తరువాత రెవెన్యూ అధికారుల సహకారం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరి సహకారంతో వారం రోజులుగా నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికీ ప్రభుత్వ ‘మీ భూమి’ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూమిగానే నమోదయి ఉంది. అయితే తమకు కోర్టు ఆర్డర్ ఉందంటూ వెళ్లిన ప్రతి ఒక్కరికీ చెబుతూ అక్రమ నిర్మాణాలు శరవేగంగా చేపడుతున్నారు.
పేదల ఇళ్లు కూల్చేస్తూ..
పేద కుటుంబాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గతంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకున్నారు. అప్పటి ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది. అప్పులు చేసి నిర్మించుకున్న నివాసాలను కూటమి ప్రజాప్రతినిధి ఆదేశాలతో అధికారులు వాటిని నేలమట్టం చేశారు.
మేత పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న దృఽశ్యం.. గతంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు (ఫైల్)
అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేశా
జీపాల్యం రెవెన్యూ గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పనులను నిలుపుదల చేశాను. కోర్టులో కేసు ఉన్నప్పుడు పనులు చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్, రేణిగుంట

ప్లాట్లు వేసి..బేరం పెట్టి !