
ముత్యపు పందిరిపై మురిసె
సింహ వాహనంపై శ్రీవారు, వాహన సేవలో పాల్గొన్న చెవిరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, ముత్యపు పందిరిలో స్వామి
తిరుపతి రూరల్ : తుమ్మలగుంటలో జరుగుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో భక్తులను కటాక్షించేందుకు వచ్చిన స్వామికి ముందు వృషభాలు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, వేద పాఠశాల పిల్లలు కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహన సేవ ఉత్సాహంగా సాగింది. ఉదయం యోగ నరసింహునిగా దర్శనమిచ్చిన స్వామి వారు రాత్రి ముత్యపు పందిరిలో కొలువై భక్తులను మురిపించారు.
సింహ వాహనం దర్శనంతోనే ధైర్యసిద్ధి
కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు శుక్రవారం ఉదయం యోగ నరసింహునిగా స్వామి వారు సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి , మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో ధైర్యం, శక్తి, తేజస్సు వంటి శక్తులన్నీ భక్తులకు అందుతాయని విశ్వాసం.
ముత్యపు పందిరిలో కల్యాణ వెంకన్న
బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు కొలువై భక్తులను మురిపించారు. ముత్యపు పందిరిలో కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్నపన తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు నిర్వహించే తిరుమంజనం కమనీయంగా సాగింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే తిరుమంజన సేవలో పాల్గొన్న భక్తులు భక్తితత్వంతో మైమరిచారు.
ఆకట్టుకుంటున్న నాదస్వరం
సింహ, ముత్యపు పందిరి వాహన సేవల్లో నాయీ బ్రహ్మణులు వినిపించే నాదస్వరం, ఆధ్యాత్మిక వాద్యం (డోలు వాయిద్యం) భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు కోలాటాలు, చెక్క భజనలు కలసి రావడంతో వాహన సేవలు చూడ ముచ్చటగా సాగుతున్నాయి.

ముత్యపు పందిరిపై మురిసె

ముత్యపు పందిరిపై మురిసె

ముత్యపు పందిరిపై మురిసె