
100 రోజులుగా చెవిరెడ్డి అక్రమ నిర్భంధం
– నేతలతో కిటకిటలాడిన విజయవాడ ఏసీబీ కోర్టు
తిరుపతి రూరల్ : కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా లిక్కర్ కేసులో అరెస్టు చేసి జైలులో నిర్భందించి శవంద రోజులు దాటింది. జూన్ 18న పార్టీ నేతలు చెవిరెడ్డిని చూసేందుకు విజయవాడకు తరలివెళ్లారు. చంద్రగిరి ప్రజలంతా ఆయన ఎప్పుడు బయటకు వస్తారా..? అని ఎదురుచూస్తుంటే పార్టీ నేతలు ఆయనను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారీ విజయవాడకు వెళ్లి ఆయనతో మాట్లాడి వస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రగిరి ప్రజలు ఆయన కుటుంబానికి అండగా నిలబడతారని, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం చెవిరెడ్డి వెంట నడుస్తుందని స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డి స్పందిస్తూ ‘‘వారు చేస్తున్న తప్పులు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది... రాజకీయాల్లో తప్పుడు కేసులు పెట్టడం సరి కాదు.. వారు చేస్తున్నారు.. మనకు తప్పదు భరించాలి..’’ అంటూ క్యాడర్ లో ధైర్యం నింపారు. కూటమి ప్రభుత్వం చెవిరెడ్డిపై చూపించే కక్షను చంద్రగిరిలో ప్రతి ఇంటికీ తెలియజేస్తామని అభిమానులు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రోజులు గడిచే కొద్దీ చెవిరెడ్డిని చూడటానికి ఏసీబీ కోర్టు వద్దకు వెళ్లే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అక్కడి కోర్టు హాలు చంద్రగిరి ప్రజలతో కిక్కిరిస్తోంది. దీనికితోడు రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కూడా అదే కోర్టుకు వస్తుండటంతో ఆయనను చూడటానికి వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.