
జ్ఞానానికి గమ్యస్థానం ఐకేఎస్ కేంద్రం
● ఎన్‌ఎస్‌యూలో ఐకేఎస్ కేంద్ర ప్రారంభం
తిరుపతి సిటీ: ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ (ఐకేఎస్) ప్రారంభించడం శుభపరిణామమని ఎన్‌ఎస్‌యూ చాన్సలర్ ప్రొఫెసర్ నీడా మంగళం గోపాలస్వామి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో అతిథులు, వర్సిటీ అఽధికారులతో కలసి ఆయన ఐకేఎస్ కేంద్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి విజ్ఞాన, వైజ్ఞానికి అంశాలను అందించడమే ఐకేఎస్ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. విదేశీయులకు సైతం వర్సిటీలోని ఐకేఎస్ కేంద్రం జ్ఞానానికి గమ్యస్థానం కావాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రహ్మశ్రీ సహస్రావధాని, పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ భారతీయ జ్ఞానపరంపరలో విశిష్ట పర్వం అవధానమని, అవధాన కళ విద్యార్థుల్లో స్మృతి శక్తిని, ప్రతిభాశక్తిని వర్ధింపజేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారతీయ జ్ఞాన పరంపరంలోని అనేక వైజ్ఞానిక, మనోవైజ్ఞానిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, న్యూఢిల్లీ జాతీయ కోఆర్డినేటర్ గంటి సూర్యనారాయణమూర్తి, డీన్లు రజనీకాంత్, దక్షణమూర్తి శర్మ, ప్రొఫెసర్ శివ రామభట్, పీఆర్‌ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.