
చూడతరమా అవస్థ
సభలు..సమావేశాలు..కూటమి డాంబికాలతో సామాన్య ప్రయాణికుడి అవస్థ చూడతరం కాలేదు. కూటమి సర్కారు తరచూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటుండడంతో బస్సుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా గమ్యస్థానాలకు చేరాల్సిన సగటు ప్రయాణికుడికి తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులతోపాటు రోజువారీ ప్రయాణికులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది.
తిరుపతి అర్బన్: ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకు ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్సులను వాడేస్తోంది. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అడిగినన్ని ఆర్టీసీ బస్సులను పంపాల్సి వస్తుంది. దీంతో బస్సుల కొరతతో ప్రయాణికులు నానా తిప్పలు పడుతున్నారు. బుధవారం ఉదయం తిరుపతిలోని చదలవాడ కళాశాల సమీపం నుంచి 80కి పైగా ఆర్టీసీ బస్సులను డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు విజయవాడలో సీఎం నుంచి నియామక పత్రాలు అందుకోవాలంటూ పంపించారు. దీంతో తిరుప తి బస్టాండ్‌తోపాటు జిల్లాలోని 11 డిపోల పరిధిలో బస్సుల కొరత తప్పడం లేదు. గంటల కొద్ది ప్రయాణికులు తమ ప్రాంతానికి చెందిన బస్సు ఎప్పుడు వస్తుందోనని వెయ్యికళ్లతో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ముందే బస్సుల కొరత..దానికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు అయినా ఆర్టీసీ బస్సులను విజయవాడకు పంపించేశారు.
బస్సు ఆగిన వెంటనే ఫుల్..
బస్టాండ్‌లో బస్సు ఆగిన ఐదు నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లకు బస్సు లు రాకముందే... బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్దే ప్రయాణికులు ఎక్కేస్తున్నారు. ఫుల్ అయిన తర్వాతే ప్లాట్‌ఫామ్‌కు వస్తుంది. బస్సులో సీటు కథ దెవుడికెరుక..నిలబడడానికి కాస్త స్థలం ఉంటే చాలురా..బాబు అంటూ ప్రయాణికులు బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి బస్టాండ్ నుంచి సాధారణ సమయంలోనే రోజుకు 1.50 లక్షల నుంచి 1.55 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు తిరుమల బ్రహ్మోత్సవాలు...మరోవైపు పల్లె వెలుగు బస్సులు ఉచిత బస్సు పథకానికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జిల్లాకు చెందిన బస్సులను ఇతర ప్రాంతాలకు పంపడం ద్వారా ప్రయాణికుల అగచాట్లు అన్నీఇన్నీకాదు....అయినా అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆర్టీసీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.