‘స్టూడెంట్‌ నెం–1’కు గోల్డ్‌ మెడల్‌! | - | Sakshi
Sakshi News home page

‘స్టూడెంట్‌ నెం–1’కు గోల్డ్‌ మెడల్‌!

Sep 26 2025 6:04 AM | Updated on Sep 26 2025 12:39 PM

నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండి

నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండి

ఓపెన్‌ డిగ్రీలో మంచి మార్కులతో జీవిత ఖైదీ యుగంధర్‌ ప్రతిభ 

మూడు పీజీలు చేసిన ఖైదీ

జీవిత ఖైదీ యుగంధర్‌ తల్లి చెంగమ్మ ఆవేదన

కడప అర్బన్‌: జీవితఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్‌ అనే ‘స్టూడెంట్‌ నెం–1’ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చడంతో గోల్డ్‌మెడల్‌ వరించింది. ఈ సంఘటనపై కడప కేంద్ర కారాగారం అధికారులు, యుగంధర్‌తో ములాఖత్‌ అవడానికి వచ్చిన అతని తల్లి చెంగమ్మ, చెల్లెలు మేఘన తెలియజేశారు. కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ లో డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనపరచడంతోపాటు మంచి ర్యాంకు సాధించడంతో అతనికి గోల్డ్‌ మెడల్‌కు ఎంపిక చేశారు. ప్రస్తుతం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ బీఏ పొలిటికల్‌ సైనన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ వారిచే గోల్డ్‌ మెడల్‌, బుక్‌ ప్రైజ్‌ పొందారు. 

ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే 26వ స్నాతకోత్సవంలో పాల్గొని, మెడల్‌ పొందేందుకు అతనికి యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఇతనికి మొత్తం 8.02 జీజీపీఏ వచ్చింది. ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, జంగాలపల్లి నివాసి అయిన గునుకుల యుగంధర్‌ 2011 జూలై 18న హత్య కేసులో జీవిత ఖైదు విధించడంతో కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పటి నుంచి ఓల్డ్‌ పాటర్న్‌లో రెండు బీఏలు, న్యూ పాటర్న్‌లో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌(సీబిఎస్‌సీ)లో రెండు బీఏలు, మూడు ఎంఏలు ఇంకా కంప్యూటర్‌ ట్రైనింగ్‌, కార్పెంటరీ ట్రైనింగ్‌, నాక్‌ స్కిల్‌ సర్టిఫికెట్లు పొందాడు. మూడేళ్లు పారా లీగల్‌ వలంటీర్‌గా పనిచేశారని కడప కారాగార అధికారులు తెలిపారు.

నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండి

హత్య కేసులో దాదాపు 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదును తన కుమారుడు యుగంధర్‌ అనుభవిస్తున్నాడని, అతని చెంగమ్మ, సోదరి మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడని, కారాగారంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని అధికారులు, ప్రభుత్వం తమ ఆవేదన గుర్తించి, తన బిడ్డను క్షమాభిక్ష పెట్టి, విడుదల చేయాలని కోరారు. 

కడప కారాగారానికి ములాఖత్‌కు వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. తమకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడని ఖైదీ తల్లి చెంగమ్మ తెలిపారు. కుమారుడైన యుగంధర్‌ తెలిసో తెలియక హత్య చేశాడని, ఆ నేరానికి 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించి, తన కుమారుడిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘స్టూడెంట్‌ నెం–1’కు గోల్డ్‌ మెడల్‌! 1
1/1

గునుకుల యుగంధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement