
తప్పిపోయిన భక్తులు అప్పగింత
తిరుమల: తిరుమలలో తప్పిపోయిన ముగ్గురు భక్తులను పోలీసులు డిజిటల్ జియోటాక్ సహకారంతో సురక్షితంగా పట్టుకుని, బంధువులకు అప్పగించారు. వివరాలు.. తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నంద్యాలకు చెందిన పీ.మోహిత్‌రెడ్డి(14), ప్రకాశం జిల్లాకు చెందిన పీ.నరసింహరావు(52), తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన మారుతి(70) తప్పిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిజిటల్ జియోటాక్ టెక్నాలజీ సహాయంతో వారిని సురక్షితంగా పట్టు కున్నారు. ఆపై వారి తల్లిదండ్రులు వెంకటసుబ్బ మ్మ, ఎం.నారాయణ, మణికి అప్పగించారు.
భక్తుల భద్రత మా బాధ్యత
భక్తుల భద్రత మా బాధ్యతని, వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో భక్తుల భద్రత మరింత బలోపేతం అవుతుందన్నారు. భవిష్యత్‌లో కూడా భక్తుల కోసం మరిన్ని సరికొత్త సదుపాయాలు అందించడానికి జిల్లా పోలీసులు కృషి చేస్తారని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 58,628 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలి గిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.