
ఉద్యోగుల తుది జాబితా విడుదల
తిరుపతి తుడా : చిత్తూరు, తిరుపతి జిల్లాల ఆరోగ్య సంస్థల సంయుక్త నోటిఫికేషన్ తుది జాబితా మంగళవారం విడుదలైంది. వైద్య సంస్థల్లో పలు కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీ మెడికల్ కళాశాలలో ఓటీ అసిస్టెంట్, అనస్తీషియా టెక్నీషియన్, మార్చురీ మెకానిక్, స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ప్రసూతి ఆసుపత్రిలో అటెండెంట్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. తాత్కాలిక మెరిట్ జాబితాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదుల ఉంటే ఈనెల 29వ తేదీలోపు సంబంధిత పత్రాలతో ప్రిన్సిపల్ కార్యాలయానికి స్వయంగా హాజరుకావాలని తెలిపారు.
సమాజ సేవలో
భాగస్వాములు కావాలి
తిరుపతి సిటీ : విద్యార్థినులు సమాజ సేవలో భాగం కావాలని ఎస్పీడబ్లూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఒక ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరిలోని పరిసరాల పరిశుభ్రత, అక్షరాస్యత, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. దీంతో గ్రామాభివృద్ధి సులభతరం అవుతుందన్నా రు. అనంతరం రోటరీ క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ వేమూరి జయరాం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నివారణకు విద్యార్థినులు సంకల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారిణి డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ దివ్వవాణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
నేడు సీఎం చంద్రబాబు రాక
తిరుపతి అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తిరుపతికి రానున్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 5.35 గంటలకు తాజ్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన 6.20 గంటలకు తిరుమల గాయత్రి అతిథి గృహానికి చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత 7:40 గంటలకు బేడీ ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకుని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటారని వెల్లడించారు. ఆ తర్వాత గాయత్రి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారని, గురువారం ఉదయం 9.10 నుంచి 9.50 గంటల వరకు వెంకటాద్రి నిలయం ట్విన్ కమాండ్ సెంటర్ – ఇంటెలిజెంట్ క్రౌడ్ – సైబర్ కంట్రోల్, శ్రీవారి ప్రసాదాల ఇంగ్రెడియెంట్స్ – విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం 10.35 గంటలకు తిరుపతి (హోటల్ తాజ్ సమీప హెలిప్యాడ్) చేరుకుని, అమరావతికి బయలుదేరి వెళ్తారని వివరించారు. ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేపట్టామని స్పష్టం చేశారు.