
క్రమశిక్షణతో మెలగాలి
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చిన పోలీసు సిబ్బందికి అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తిరుమల పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద మంగళవారం వారు సిబ్బందితో మాట్లాడుతూ తిరుమల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఇక్కడ విధులు నిర్వహించడం దేవునికి సేవ చేయడమే అన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
శ్రీవారి సాలకట బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. అందులోభాగంగా గరుడోత్సవం రోజున 4 నుంచి 5 లక్షల మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. మిగతా రోజుల్లో రోజుకు సుమారు లక్షమంది దర్శించుకుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3,782 మందితో పటిష్ట భద్రతా ఏర్పాటు చేపట్టినట్లు డీఐజీ, ఎస్పీ తెలిపారు. గరుడసేవ సందర్భంగా తిరుమలకు ద్విచక్ర వాహనాలను 27వ తేదీ మధ్యాహ్నం నుంచి అనుమతించేది లేదని చెప్పారు. తిరుమలలో 32 ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేసి 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. తిరుపతిలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అలిపిరి బస్టాండ్, పాత చెక్‌పాయింట్, ఇస్కానన్ మైదానం, మెడికల్ కళాశాల మైదానం, నెహ్రూ మున్సిపల్ మైదానంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థ 10 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామన్నారు. చిన్నారులు. వృద్ధులకు జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం తిరుమలలోని నాలుగు మాడ వీధులను పరిశీలించారు.