
కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
దొరవారిసత్రం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి బాలకృష్ణానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం పాళెంపాడు గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాళెంపాడులో ఇప్పటి వరకు 23 మంది కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరిలో ఇద్దరు మాత్రమే డయాలసిస్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో నీటి సరఫరా ఏ విధంగా ఉందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మరోమారు గ్రామంలో ఇంటింటికీ వైద్య పరీక్షలు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఆయన వెంట ఎపిడెమియాలజిస్ట్ లావణ్య, వైద్యాధికారి చైతన్య, సిబ్బంది ఉన్నారు.
మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌కు పురస్కారం
తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ ప్రొఫెసర్ చండి ఎం కుమారికి జమ్మూలోని ‘షేర్–ఎ–కాశ్మీర్ వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం’లో 10వ ఆసియా పీజీపీఆర్ అంతర్జాతీయ సమావేశంలో మహిళా శాస్త్రవేత్త అవార్డు లభించింది. ‘సూక్ష్మజీవుల సాంకేతికత, స్థిరమైన పర్యావరణానికి సూక్ష్మజీవుల వాడకం’పై ఆమె చేసిన పరిశోధనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. అలాగే ‘అబియోటిక్ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా పంట స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి అవసరమైన వ్యూహాలను అభివృద్ధి చేయడం’ అనే అంశంపై మాట్లాడిన ఆమె మొదటి బహుమతి అందుకున్నారు.
క్రషర్ ఏర్పాటుపై నిరసన
కేవీబీపురం : బ్రాహ్మణపల్లి గ్రామంలో క్రషర్ ఏర్పాటును నిరసిస్తూ కేవీబీపురం తహసీల్దార్ రోశయ్యకు గ్రామస్తులు వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే ఉన్న క్రషర్‌తో తిప్పలు పడుతుంటే, అధికారులు మరో క్రషర్ ఏర్పాటుకు అనుమతి ఎలా ఇస్తారని బ్రాహ్మణపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిందేశం రెవెన్యూలో ఉన్న క్వారీ , క్రషర్ బ్రాహ్మణపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్నందున ఇప్పటికే నానా తిప్పలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. క్రషర్, క్వారీతో చెరువులు, పంట పొలాలు, తాగునీరు కలుషితమై మూగజీవాలు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. ఇప్పుడు తమ గ్రామంలో మరో క్రషర్ ఏర్పాటుకు తమిళనాడు వాసులు పావులు కదపడం, అధికారులు అందుకు వత్తాసు పలకడం సరికాదన్నారు. గ్రామస్తుల విన్నపాన్ని కాదని క్రషర్‌కు అనుమతి ఇస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
యూరియా వినియోగం తగ్గించాలి
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : నానో ఎరువులు వాడటం వలన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నానో ఎరువుల ప్రాముఖ్యం, వాడకంపై మండల ఏవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏర్పడుతున్న యూరియా కొరతను అధిగమించడానికి యూరియా వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై రైతుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ మేనేజర్ స్వరూప్ మాట్లాడుతూ.. నానో ఎరువుల తయారీ, వివిధ పంటల్లో దశల వారీగా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. డీఏవో కార్యాలయ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, సీనియర్ అగ్రోనమిస్ట్ సేల్స్ ఆఫీసర్ మురళీ పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి