
ఈ–సేవ ఉద్యోగుల నిరసన
తిరుపతి కల్చరల్ : తొలగించిన 607 మంది ఈ–సేవ ఉద్యోగులను మంత్రి లోకేష్ హామీ మేరకు తిరిగీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరు జిల్లాలకు చెందిన ఈ సేవ ఉద్యోగులు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం అభ్యర్థన దీక్ష పేరుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ... యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ తొలగించిన ఈ సేవ ఉద్యోగులను తీసుకుంటామని, వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఈ సేవ ఉద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేదన్నారు. ఏపీ మీ సేవా కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు నడపడానికి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేయడంలోనూ కీలక పాత్ర వహిస్తున్నామని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ సేవ ఉద్యోగులకు పని భారం తగ్గించడానికి, తొలగించిన కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.