డబ్బున్నోళ్లకేనా వైద్య విద్య? | - | Sakshi
Sakshi News home page

డబ్బున్నోళ్లకేనా వైద్య విద్య?

Sep 18 2025 6:43 AM | Updated on Sep 18 2025 6:43 AM

డబ్బున్నోళ్లకేనా వైద్య విద్య?

డబ్బున్నోళ్లకేనా వైద్య విద్య?

పేదలకు ఉచిత వైద్య విద్య అందించేందుకే జగనన్న హయాంలో 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణం నాడు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు ప్రైవేటు పరం కాకుండా ఉద్యమ పోరాటాలు చేపడతాం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం : ‘‘వైద్య విద్య కేవలం డబ్బున్నోళ్లకేనా? ప్రతిభ ఉన్నా, పైసలు లేకపోతే వైద్య విద్య అభ్యసించే అర్హత పేద విద్యార్థులకు ఉండదా? చంద్రబాబూ’’ అంటూ వైఎస్సార్‌సీపీ యువజనవిభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏనాడు పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రతిభ కలిగిన ప్రతి పేద విద్యార్థి వైద్య విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో జగనన్న రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలను నిర్మించారన్నారు. అందులో ఐదు కళాశాలలు నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశకు చేరుకున్నాయన్నారు. మిగిలిన పది కళాశాలలు కూడా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వాటికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయిపోతాయన్నారు. అలా చేయకుండా జగనన్న స్థాపించిన 17 మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరంచేసి పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా చేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

వేల కోట్లు మింగేసేందుకు చంద్రబాబు కుట్రలు

మెడికల్‌ కశాలలను ప్రైవేటుపరం చేసి వేల కోట్ల రూపాయలు మింగేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకాలంలో సుమారు రూ.2.15లక్షల కోట్లను చంద్రబాబు అప్పుగా తెచ్చి దేనికి ఖర్చు చేశారని ప్రశ్నించారు. లక్షల కోట్లను అప్పు చేస్తున్న చంద్రబాబు కేవలం రూ.6వేల కోట్లను ఖర్చుచేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించలేరా? అని ప్రశ్నించారు. అవి పూర్తయితే జగనన్నకు మంచిపేరు వస్తుందనే అక్కసుతో మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు లక్షలాది రూపాయలు దోచుకుంటే.. జగనన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ ఉద్యమ పోరాటాలు

పేదలకు ఉచిత వైద్య విద్య అందించేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమ పోరాటాలు చేపడుతామని చెప్పారు. మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 19వ తేదీన మదనపల్లె మెడికల్‌ కళాశాల వద్ద పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

భూమన కేసులకు భయపడే వ్యక్తి కాదు

ఎమర్జెన్సీ సమయంలో దేశంలోనే అతి పిన్న వయసులో రెండేళ్ల జైలుకు వెళ్లిన వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని అభినయ్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, ప్రజా సంక్షేమం కోసం అనేక ఉద్యమ పోరాటాల్లో అనేక కేసులు పెట్టినా భయపడని నాయకుడు కరుణాకరరెడ్డి అని చెప్పారు. అలాంటి నాయకుడిపై టీటీడీ చైర్మన్‌, అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తే భయపడతారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్‌, జిల్లా, నగర అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, దినేష్‌రాయల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement