
క్రైమ్ థ్రిల్లర్‌లా నాలుగు శవాల కేసు
సంచలనంగా మారిన నాలుగు మృతదేహాల కేసులో అంతులేని అనుమానాలు
మృతులెవరో తేలింది.. కానీ అసలు ఘటనకు కారణమేంటి ?
పోస్టుమార్టంలో వెలుగులోకి వచ్చిన
సంచలన విషయాలు
జులైలో తన భార్య పిల్లలు కనిపించలేదని ఫిర్యాదు చేసిన వెంకటేష్
నిర్లక్ష్యంగా వ్యవహరించిన
తమిళనాడు పోలీసులు
మిస్టరీ ఛేదించాల్సింది ఆంధ్రా పోలీసులే!
పాకాల : జిల్లాలోనే సంచలనంగా మారిన నాలుగు మృతదేహాల కేసు మిస్టరీ వీడట్లేదు. కేసు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ నెల 14వ తేదీన పాకాల టోల్‌గేట్ సమీప ప్రాంతంలోని అడవిలో గుర్తించిన నాలుగు శవాలు చైన్నె వాసులుగా గుర్తించిన విషయం విదితమే. కేసు విచారణలో భాగంగా పాకాల పోలీసులు ఘటనా స్థలిలో దొరికిన ఆధారాలతో తంజావూరు ఆస్పత్రికి ఫోన్ చేసి డాక్టర్ రాసిన రశీదులో ఉన్న వివరాల ఆధారంగా ఆరాతీయగా కలైసెల్వన్‌తో పాటు మిగతా ముగ్గురు మృతుల వివరాలను అందించారు. సమాచారం అందుకున్న వెంకటేష్ మంగళవారం పాకాల పోలీస్టేషన్‌కు చేరుకుని తమిళనాడులో నాగపట్నం జిల్లా తిక్కచ్చేరి పోలీస్టేషన్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇందులో కలైసెల్వన్ తన భార్య పెద్దమ్మ కుమారుడని వెంకటేష్ తెలిపారు.
పోస్టుమార్టంంలో తేలిందేమిటి ?
మృతదేహాలను పరిశీలించిన పోలీసులు మొదట్లో ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేక అనారోగ్య సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించారు. అయితే సోమవారం కలైసెల్వన్, జయమాల మృతదేహాలకు చేసిన పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరి నోట్లో గుడ్డలు కుక్కి ఆపై మూతికి ప్లాస్టర్ వేసినట్లు తేలింది. అలాగే మంగళవారం చిన్నారులు దర్శిణి, వర్షిణికి చేసిన పోస్టుమార్టంలో వర్షిణి నుదుటిపై పెద్ద గాయం, బర్రెముకలు చిట్లడం, గొంతు వద్ద వాచినట్లు గుర్తించారు. కలైసెల్వన్ జయమాల, చిన్నారులను అడవిలోకి తీసుకొచ్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఇంకా ఎవరైనా వీరిని అడవిలోకి తీసుకొచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా ? అనేది తేలాల్సి ఉంది.
చైన్నె పోలీసులు వైఫల్యమే కారణమా ?
జయమాల, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని జులైలో చైన్నె పోలీసులకు ఫిర్యాదు అందితే రెండున్నర నెలలు గడిచినా పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఎంతో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా చైన్నె పోలీసులు నిర్లక్ష్యం వల్లే నలుగురు మృత్యువాత పడ్డారనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రా పోలీసులైనా కేసును వేగవంతం చేసి హత్యలా ? ఆత్మహత్యలా ?..మృతుల వెనక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలని కోరుతున్నారు.
పోలీసులతో కలసి అడవిలోకి వెంకటేష్
పోలీసులు కలై సెల్వన్, జయమాల మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం అక్కడే ఉన్న రెండు గుంతలను తవ్వి మృతదేహాలను పరిశీలించారు. అందులో ఆధార్‌కార్డులు, పాన్ కార్డులు, చిల్లర డబ్బులు, చాక్లెట్లు, ఒక ఫోన్ కనిపించాయి. దీన్ని పరిశీలించిన వెంకటేష్ చనిపోయింది తన భార్య జయమాల(33), పిల్లలు దర్శిణి(9), వర్షిణి(3) అని నిర్ధారించి మృతదేహాల వద్ద బోరున విలపించాడు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో జయమాల.. తన భర్త అప్పుడప్పుడు పంపిన నగదును ఆమె పెద్దమ్మ కుమారుడు కలైసెల్వన్(38) కలసి ఫైనాన్స్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కలైసెల్వన్‌పై చీటింగ్ కేసులు ఉన్నాయని, అక్కడ పోలీసులు అరెస్టు చేస్తారని పారిపోయినట్లు తెలిసింది. జయమాల తన భర్తకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక పిల్లలతో కలసి పారిపోయిందని వారి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

క్రైమ్ థ్రిల్లర్‌లా నాలుగు శవాల కేసు