
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణంలో బుధవారం సాయంత్రం ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు వీధిలో నివాసం ఉంటున్న చిట్టేటి వెంకటకృష్ణ, తులసి దంపతులకు చిట్టేటి లోకేష్ (7) అనే కుమారుడున్నాడు. వెంకటకృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తులసి మేనకూరు సెజ్‌లో కార్మికురాలిగా పనిచేస్తోంది. వీరిద్దరూ బుధవారం కుమారుడిని ఇంటి వద్ద వదిలి యథావిధిగా పనికి వెళ్లారు. సాయంత్రం వెంకటకృష్ణ ఇంటికి వచ్చేసరికి కుమారుడు లోకేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. నోటిలోంచి నురగ వస్తోంది. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.