
జాతీయ మహిళా సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం లైజన్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి శాసనమండలి సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో జరగనున్న మహిళా జాతీయ సాధికారి సదస్సుకు విచ్చేస్తున్న వీఐపీలకు అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. తిరుపతి రాహుల్ కన్వెనన్ సెంటర్‌లో సదస్సు ఉంటుందని, 300 మంది సచివాలయ ఉద్యోగులతో పాటు పలువురు జిల్లా, డివిజన్, మండల అధికారులకు డ్యూటీలు వేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఒక రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఉంటుందన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఆర్డీఓ రామ్మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.