
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 70,086 మంది స్వామివారిని దర్శించుకోగా 28,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది.
16న అంకురార్పణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 16వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. గృహస్తులు (ఇద్దరు) రూ.1,000 టికెట్ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, వడ, ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా ఈ నెల 19న అభిషేకం (ఏకాంతం), 20న కల్యాణోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసింది.
నియామకం
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీ.వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు చేసుకోండి
తిరుపతి అర్బన్: ఫర్నీచర్ సెక్టార్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఈ నెల 22 నుంచి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పిస్తున్నట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులతో పాటు ఆ పైన చదివిన వారు అర్హులన్నారు. స్కిల్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతం సమీపంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎన్‌ఎస్‌టీఐ వద్ద మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం కంపెనీల్లో 6 నెలలు పాటు అప్రెంటిషిష్ స్కీమ్ తర్వాత ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. సమాచారం కోసం 7673976699 నంబర్‌లో సంప్రదించాలని చెప్పారు.
డిగ్రీ ప్రవేశాలపై వీడని సందిగ్ధత
తిరుపతి సిటీ: ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. 10వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఊసే ఎత్తకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయోమయంలో పడ్డారు. కనీసం డిగ్రీ అడ్మిషన్లు సక్రమంగా చేపట్టలేని కూటమి సర్కార్ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తోందని వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూసిన విద్యార్థులకు ఇప్పటికీ ప్రవేశాలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంపై మండిపడుతున్నారు.