
పోలేరమ్మా
రాష్ట్ర పండుగగా రెండురోజుల పాటు జరిగిన పోలేరమ్మ జాతర గురువారం సాయంత్రం అమ్మవారి నిష్క్రమణతో వైభవంగా ముగిసింది.
సుమారు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.
జైపోలేరు.. జైజై పోలేరంటూ మార్మోగిన వెంకటగిరి జాతరకు లక్షలాది మంది రాక నిబంధనలకు స్వస్తి.. రాజాలకు అవమానం కూటమి నేతల కోసం ప్రత్యేక క్యూ ముగిసిన పోలేరమ్మ జాతర
వేవేల దండాలు తల్లీ..
అమ్మా.. పోలేరూ తల్లీ.. కరుణించమ్మా.. కాపాడరావమ్మ పోలేరమ్మా అంటూ భక్తుల జయజయధ్వానాల నడుమ జాతర ముగిసింది. అయితే ఈ ఏడాది జాతర సంప్రదాయాలకు కూటమి నేతలు స్వస్తి పలికారు. అంతటా వారి పెత్తనమే ఎక్కువగా కనిపించింది. జాతర వేళ రెండు రోజుల పాటు పూర్తిగా మద్యం అమ్మకాలను నిలిపివేయడం మొద టి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే 48 గంటల పాటు కాకుండా కేవలం 24 గంటలు మాత్రమే నిషేధించారు. ఆపై మద్యం ఏరులై పారింది. రాజాలకు కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా కూటమి నేతలు అడుగడుగునా అడ్డు తగిలారు. మరోవైపు తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
సైదాపురం/వెంకటగిరి రూరల్ : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్య మానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతి రూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి.
సారె సమర్పణ..
వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్‌సీపీ నేత బి.మస్తాన్‌యాదవ్, నాయకులు దర్శించుకున్నారు.
జాతరకు భద్రత..
జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం..
భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.
దున్నపోతు బలితో ముగింపు
జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు.
పట్టువస్త్రాల సమర్పణ
జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్ నక్కా భానుప్రియ హాజరయ్యారు.
జాతరలో ప్రత్యేకతలు