తిరుపతి అర్బన్ : మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్ వైఎస్సార్ కడప జిలా ఉద్యానశాఖ డిప్యూ టీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన మూడేళ్లుగా మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారిగా పనిచేశారు. అలాగే విజయనగరంలో పనిచేస్తున్న చిన్నరెడ్డెప్పను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారంలో సతీష్ జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వర కు 66,312 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,728 మంది తలనీలా లు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమ ర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తుల కు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శ నం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
డిగ్రీ అడ్మిషన్ల
గందరగోళానికి తెర
తిరుపతి సిటీ : డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు, అధ్యాపకులను గందరగోళానికి గురి చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు ఎట్టకేలకు సందిగ్ధానికి తెర దించారు. శనివారం సాయంత్రం వరకు ఇప్పటికే ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాల సమర్పణలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపించనున్నట్లు కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో సోమవారం రిపోర్టు చేసి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
17న తడలో జాబ్‌మేళా
తిరుపతి అర్బన్ : ఈనెల 17న తడలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీసిటితో పాటు తిరుపతి, చైన్నె ప్రాంతాల్లో ఉద్యోగాల ఎంపికకు ఈమేళా జరుగుతోందని చెప్పారు. పదో తరగతితో పాటు ఆ పైన చదువుకున్న విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు నైపుణ్యం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 91216 46661, 99888 53335 నంబర్లను సంప్రదించాలని కోరారు.
16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీవాణి తెలిపారు. దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. 16న అంకురార్పణ, 17న పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, 19న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అమ్మవారి ఆలయంలో..
22 నుంచి నవరాత్రి ఉత్సవాలు
చంద్రగిరి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 2వ తేదీ విజయ దశమి సందర్భంగా అమ్మవారు గజ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు అధికారులు చెప్పారు.