
అనుమతి ఎక్కడో?
కాలేజీ ఇక్కడ..
జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు
ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు 109 ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 5,475 అనుమతులు ఉన్న కళాశాలలు 77 అనుమతి లేకుండా బ్రాంచీల పేరుతో నడుస్తున్న కళాశాలలు 32 అనుమతుల లేని కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 21 వేలు నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కలిగిన కళాశాలలు 35 ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు లేని కళాశాలలు 97
జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు కళాశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. అనుమతి ఒకచోట తీసుకొని..చదువు ఒక చోట ..నిర్వహణ మరోచోట చేస్తూ కొన్ని ప్రైవేటు కళాశాలలు దందా సాగిస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులను బురిడీ కొట్టించి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఇంటర్ మీడియట్ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. నిబంధనలు లేకున్నా అనుమతులు ఇచ్చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుండడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ ప్రలోభాలతో అధికారులను లొంగదీసుకుని వారికి అవసరమైన అనుమతులను పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా తిరుపతి నగరంలో ప్రైవేటు యాజమాన్యాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి వారు ఆదేశించిన ప్రకారం అధికారులు తలవంచేలా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కొన్ని కళాశాలకు అనుమతులు ఒక చోట పొంది మరొక చోట తరగతులు చెబుతున్నారు. అలాగే అనుమతి ఒక కళాశాల పొంది రెండు, మూడు బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ తతంగం సాగుతున్న విషయం ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనుమతి లేని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
మంత్రి కళాశాలలు నిబంధనలకు చెల్లుచీటీ
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ కళాశాలలను అనుమతి లేకుండా నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు, మేథావులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారపార్టీకి చెందిన ఓ మంత్రికి చెందిన కళాశాలలు తిరుపతి జిల్లాలో అనుమతి పొందినవి కేవలం 4 మాత్రమే. కానీ బ్రాంచీల పేరుతో నడుపుతున్న కళాశాలలు సుమారు 11 వరకు ఉన్నాయని విద్యార్థి సంఘాలు అధికారులకు విన్నవించాయి. కానీ ఇంటర్ విద్యాశాఖాధికారులు మంత్రి కళాశాలలపై కన్నెత్తి చూడకపోవడం దారుణం. కళాశాల బ్రాండ్ పేరుతో ఒక చోట అనుమతి పొంది అదే అనుమతులతో సుమారు 3 నుంచి 4 బ్రాంచ్‌లను నడుపుతూ వ్యాపారం చేసుకుంటున్నా అధికారులు అటు వైపు చూసిన దాఖలాలు లేవు
ఇరుకై న అపార్ట్‌మెంట్‌లలో తరగతులు
జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కళాశాలకు సైతం పూర్తి స్థాయి మౌలిక వసతులు లేకపోవడం దారుణం. ఇంటర్ విద్యామండలి నింబధనల ప్రకారం విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా తరగతి గదులు ఉండాలి. కానీ జనవాసాల మధ్య ఇరుకై న అపార్ట్‌మెంట్‌లనే తరగతి గదులుగా చూపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు అపార్ట్‌మెంట్‌లలో నిర్వహించే కళాశాలలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జూనియర్ కళాశాల అనుమతులు పొందాలంటే 8 వేల చదరపు అడుగులు స్లాబ్ ఏరియా కచ్చితంగా ఉండాలి. అలాంటి నిర్మాణానికి అనుమతులు ఉండాలంటే స్థానిక పాలన నియమాల ప్రకారం సెట్ బ్యాక్ కింద కాంపౌండ్ వాల్, ఫ్రంట్ స్పేస్, వెంటిలేషన్ కింద స్థలం వదలాల్సి ఉంటుంది. విద్యార్థులకు, అధ్యాపకులకు పార్కింగ్ స్థలం చూపాలి. వీటన్నింటికి మించి ఫైర్ ఇంజిన్ ఏర్పాట్లు, ప్రమాదాన్ని నివారించే వెసులుబాటు ముఖ్యంగా ఉండాలి. ఇలాంటి నిబంధనలు కేవలం తూతూమంత్రంగా చూపిస్తూ మామూళ్లు ముట్టజెప్పి అనుమతులు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 5 శాతం కళాశాలలు సైతం గ్రౌండ్ (క్రీడామైదానం) లేని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు పురపాలక పరిధిలో రెండెకరాలు, కార్పొరేషన్ పరిధిలో ఒక ఎకరా కనీస ప్లే గ్రౌండ్ చూపించాలి. ఆ స్థాయి స్థలం విలువ లక్ష లు, కోట్లల్లో ఉండేటప్పటికీ స్థలం ఉన్న భూ యజమానిని తమ సొసైటీలో సభ్యుడిగా చూపించి, సదరు వ్యక్తి స్థలాన్ని ప్లే గ్రౌండ్ గా చూపిస్తుండటం ప్రైవేట్ కళాశాలల తెలివి తేటలకు నిదర్శనం.ఇవ న్నీ అధికారులకు తెలిసినా అనుమతులు ఇచ్చేస్తున్నారు.