
మొక్కుబడిగా పెట్టుబడిదారుల సదస్సు
ప్రత్యేక ఆహ్వానితులకే అధిక సమయం మమ అనిపించిన మంత్రి ప్రసంగం సన్మానాల కార్యక్రమంగా మారిన వైనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. ఇన్వెస్టర్స్‌తో, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత పాలనపై విమర్శలు గుప్పించారు.
ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు
టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. అయితే రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్‌ను పిలువలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ జిల్లా పర్యాటకశాఖ అధికారిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు.
సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి దుర్గేష్
ఇన్వెస్టర్లలో ఒక్కరిగా మూలన ఆసీనులైన సీఆర్ రాజన్

మొక్కుబడిగా పెట్టుబడిదారుల సదస్సు