
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
చంద్రగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్– 257 జిల్లా గౌరవ సలహాదారు వెంకటముని డిమాండ్ చేశారు. పాఠశాల సమయానంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గురువారం తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్‌లకు మెయిల్, వాట్సాప్‌లలో వినతులు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.