
భక్తులకు నాణ్యమైన సేవలు అందించండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ పరిపాలనా భవనంలోని పలు విభాగాలను గురువారం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం సందర్శించారు. మొదట అకౌంట్లు, అన్నదానం, బోర్డు సెల్, ఐటీ, సోషల్ మీడియా, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ తదితర కార్యాలయాలను పరిశీలించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పని తీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు. ముందుగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ పరిపాలనా భవనానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం నుంచి వచ్చిన వేద పండితులు చాంబర్‌లో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు వేదాశీర్వచనం చేశారు. ఎఫ్‌ఏ అండ్ సీఏఓ బాలాజీ, అదనపు ఎఫ్‌ఏసీఏఓ రవిప్రసాద్, చీఫ్ ఇంజినీర్ టీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.